హైదరాబాద్ : ఎక్కడ ఏ భర్తీలు జరిగినా జనరల్ అభ్యర్థుల కంటే ఓబీసీకి కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటుంది. అది సహజం. కానీ ఐఐటీల్లో ప్రవేశాలకు ఖరగ్‌పూర్ ఐఐటీ సోమవారం రాత్రి ఇంటర్మీడియెట్‌లో టాప్-20 పర్సంటైల్‌కు ప్రకటించిన కటాఫ్ మార్కులు తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి. జనరల్ విద్యార్థుల కన్నా ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు ఎక్కువ నిర్ణయించడమే దీనికి కారణం. అంతేకాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కటాఫ్ మార్కులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము విద్యార్థుల మార్కుల సీడీ మాత్రమే పంపించామని, అంతకుమించి తాము కటాఫ్ మార్కులకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వలేదని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంటోంది. కటాఫ్‌పై అటు సీబీఎస్‌ఈ గానీ, ఐఐటీ ఖరగ్‌పూర్ గానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల టాప్-20 పర్సంటైల్ కటాఫ్ విషయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర మార్కులను లేదా ఇంటర్మీయట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కులను కలిపి చూపించుకోవచ్చని స్పష్టం చేసింది.